తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని రాష్ట్ర సర్కారు పేర్కొంది. ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన TS-ఐపాస్ చట్టంతో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికామని శాసనసభలో మంత్రి హరీశ్ రావు తెలిపారు. స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలనతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ సమర్థవంతంగా ఉండటం వల్లే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
2023-24 ఆర్థిక ఏడాదికి గానూ ఐటీ, పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని అన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారిందని చెప్పారు. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషమని వెల్లడించారు.
‘ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికి గాను 26.14 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ టవర్లను నిర్మించింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ మరియు సిద్దిపేటలో ఐటీ టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తాం. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదిస్తున్నా’ను.’ – హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి