కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అప్పుడే ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. అభ్యర్ధులు ఎవరనేదాని పై జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా పైగ సిట్టింగ్ సీటు కావడంతో వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక టీడీపీ కూడా అభ్యర్ది పై క్లారిటీతో ముందే ప్రచారాని సిద్దమవుతుంది.
కడప జిల్లా బద్వేల్ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. బద్వేల్ ఎమ్మెల్యేగా 2019లో గెలుపొందిన డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యం కారణంగా గత నెలలో మృతిచెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడే పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనేదానిపై చర్చ సాగుతోంది. సాధారణంగా బద్వేలు నియోజకవర్గంలో అధికార వైసిపిలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిదే హవా. అంతే కాదు ఆయన మాటకే వైసీపీ అధిష్టానం సైతం విలువ ఇస్తుంది. కాబట్టి అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎవరి పేరు చెబితే వారే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణానంతరం ఆయన సతీమణి డాక్టర్ సుధకే టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. ఇటీవల జిల్లా నేతలతో సీఎం జగన్ మాట్లాడిన సమయంలో కూడా ఆమెకే ఇవ్వాలని మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిర్ణయాన్ని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కూడా పార్టీ ముందు పెట్టారు. వైసీపీలో ఇతరులు కొంతమంది ప్రయత్నం చేసినా అధిష్టానం ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్యకే ఒకే చెప్పడంతో మిగిలిన ఆశవహులంతా సైలెంట్ అయ్యారు.
ఇక టీడీపీ విషయానికొస్తే పార్టీ ఆవిర్భావం నుంచి మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుటుంబానిదే ఇక్కడ హవా కొనసాగుతోంది. వీరారెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా వారే టీడీపి అభ్యర్ది ఎవరన్నది నిర్ణయిస్తారు. 2019 ఎన్నికలలో టీడీపీ తరపున రాజశేఖర్‌ని నిలబెట్టినా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మరోసారి రాజశేఖర్‌వైపే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మొగ్గు చూపుతున్నారనే చర్చ నడుస్తోంది.
మొత్తానికి నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయం రంజుగా సాగుతోంది. అయితే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా..చేయకపోయినా వార్ వన్ సైడే అంటున్నారు వైసీపీ నేతలు.