దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలను పాటించని వారిపై జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది.రైల్వే పరిసరాలు, రైళ్లలో మాస్క్ ధరించకపోతే రూ. 500 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు నెలల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అలా కాకుంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఇవి అమలులో ఉంటాయని వెల్లడించింది.
రైల్వే పరిసరాల్లో ఉమ్మడం లాంటివి చేస్తే కూడా వారిపై జరిమానా విధించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇక అపరిశుభ్రత వల్ల ప్రజారోగ్యం దెబ్బ తింటుందని, ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొంది. కాగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం అత్యవసరమని రైల్వే ప్రకటించింది. దీనికోసం గతేడాది మే 11న భారత రైల్వే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.