ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో ఎంత బలంగా ఉన్నా సరే నాయకత్వం విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేస్తూ వచ్చారు. పార్టీలో యువ నాయకత్వాన్ని కాకుండా తనతో ముందు నుంచి ఎవరు అయితే ఉన్నారో వారిని మాత్రమే ఆయన తన పక్కన పెట్టుకుని ముందుకు నడిపిస్తూ వచ్చారు. వారి సహాయమే ఎక్కువగా తీసుకున్నారు.
ఇక ఆర్ధికంగా అలాగే పార్టీ కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని చంద్రబాబు నాయుడు అప్పుడు పట్టించుకున్న పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు కూడా దాదాపుగా అదే తప్పు మరోసారి చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు ఇవ్వలేదు. రాజకీయంగా ఇది ఆ పార్టీకి చాల ఎదురు దెబ్బ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.
తెలుగు యువత బాధ్యతలను గతంలో నిర్వహించిన అమరనాథ్ రెడ్డి, కొడాలి నానీ వంటి వారు ఆ తర్వాత ఎంత బలమైన నేతలుగా ఎదిగారో అందరికి తెలిసిందే. దేవినేని అవినాష్ కూడా ఇప్పుడు తన సత్తా చూపిస్తున్నారు. అలాంటి కీలక పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ముందుకు అడుగు వేయడం లేదు అనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా బలపడాల్సిన ఈ సమయంలో చాలా మంది నేతలు ఎదురు చూసే ఆ పదవిని ఎందుకు ఇంకా భర్తీ చేయడం లేదు అనేది అర్ధం కావడం లేదు.
జేసి పవన్ రెడ్డి, చింతకాయల విజయ్, బండారు శ్రావణి వంటి వారు ఎందరో ఉన్నారు. రాయలసీమలో చాలా వరకు యువ నాయకత్వం ఉంది. అయినా సరే ఆ పదవి ఇవ్వడానికి ఎవరూ లేరు అన్నట్టే చంద్రబాబు నాయుడు వ్యవహరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆ పదవి కీలకం అనే విషయం అందరి కంటే బాగా చంద్రబాబుకే తెలుసు. అయినా సరే ఆయన వైఖరి ఏ మాత్రం మారడం లేదు. ఇది మారకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.