ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల 2024 ప్రచారంలో భాగంగా తాడికొండలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నాలుగు భవనాలు కడితే రాజధాని పూర్తయినట్లా? అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు పోటీగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానన్నారు చంద్రబాబు. ” నేను, పవన్, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. జూన్ 4న ఇక్కడే విజయోత్సవాలు చేసుకుందాం. అమరావతి రక్షణ.. జగనాసుర వధ రెండూ జరుగుతాయి” అని చంద్రబాబు తెలిపారు.
ఇది తాడికొండ కాదు.. ఇది అమరావతి.. రాజధాని ప్రాంతం. అమరావతికి వచ్చా.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. అమరావతిని ఎవరూ కూడా కదల్చలేరు అని అన్నారు. అమరావతికి కేంద్రం కూడా సహకరించింది. ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉంది అని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు అని గుర్తు చేశారు.. సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్‌ను మహానగరంగా మార్చాను. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం అని తెలిపారు.. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాను. ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించాను” అని చంద్రబాబు నాయుడు అన్నారు.