మనం ప్రయాణిస్తున్న బస్సుకు ఒక్క సారిగా ప్రమాదం జరిగి.. డ్రైవర్ లేకుండా బస్సు ముందుకు కదులుతుంటే.. పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే ఇలాంటి ఘటననే ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి సమీపంలో జరిగిన ఓ ప్రమాదం ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆర్టీసీ కండక్టర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. కావలి నుంచి 24 మంది ప్రయాణికులతో నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కావలి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రసాద్ ఎగిరి అమాంతం రోడ్డుపై పడిపోయాడు. డ్రైవర్ లేకుండానే బస్సు రోడ్డుపై రయ్..రయ్.. అంటూ పరుగులు తీసింది.
అది చూసి ప్రయాణికులు హడలిపోయారు. ప్రాణభయంతో కేకలు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ నాగరాజు స్టీరింగ్ వద్దకు వచ్చి బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగిఉండేది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ఢీకొన్న కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కారును విశాఖపట్టణానికి చెందిన విజయ్‌పంత్ అనే డాక్టర్‌కు చెందినది గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.