చరిత్ర కాబోతున్న వార్త కూడా ఇదే ! కోయం బత్తూరు లో జరిగిన ఈ ఘటన ఇప్పుడిక సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నరేశ్, గాయత్రి జంట తమ నాలుగేళ్ల చిన్నారి విల్మను బడికి పంపించాలి అని అనుకున్నారు. అడ్మిషన్ టైంలో కులం, మతం అన్నీ అడుగుతారు కదా ఎందుకొచ్చిన గొడవ అనే ముందే అవేవీ వద్దు అని అనుకున్నారు. వాటికి అతీతంగా తమ బిడ్డను పెంచి ఆదర్శం కావాలని తపించారు. ఆ విధంగానే వాళ్లు అధికారులను ఒప్పించి వారి మనసులు సైతం గెలుచుకున్నారు. ఇప్పుడీ బిడ్డకు కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే అన్న భావనకు మరింత ప్రాథమిక నిదర్శనం, బలమైన రుజువు ఈ చిన్నారే కావడం ఈ ఉదయం నమోదయిన విశేషం.పొరుగున ఉన్న తమిళ ప్రాంతం, కోయంబత్తూరులో సాయిబాబా కాలనీకి చెందిన ఈ జంట జీవితం మున్ముందు కూడా ఆనందమయం కావాలన్నదే అందరి ఆకాంక్ష.
కులం చూడొద్దు .. మతం చూడొద్దు.. మనుషులం అని గుర్తించండి చాలు. అదొక ప్రత్యేక గుర్తింపు కాదండి అదే ఒక సామాన్య గుర్తింపు. ఈ దేశం ప్రగతి గతి పొందాలంటే కుల రహిత సమాజం రావాలన్న స్వప్న సాకారం ఇలాంటి ప్రయత్నం. మతాలకు అతీతంగా మానవత్వమే ప్రథమావధిగా సాగాలంటే అందుకు నిదర్శనం ఇలాంటి ప్రయత్నం. ఇదే ఇప్పుడు మన జీవితాలను మేల్కొల్పాలి. మానవ వికాస గతికి ఇలాంటి సత్సంకల్ప సహిత కార్యక్రమాలే మేలు చేస్తాయి కూడా !