జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. పుల్వామా దాడుల విషయంలో కేంద్రం తీరుపై తాజాగా విమర్శలు చేసిన సత్యపాల్ మాలిక్ కు సీబీఐ మరో కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. జమ్మూ కశ్మీర్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో అనిల్ అంబానీ ఇన్సూరెన్స్ సంస్ధ కాంట్రాక్టు రద్దు చేసిన వ్యవహారంపై ఆయనకు సమన్లు పంపారు.
సత్యపాల్ మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కు సంబంధించిన స్కామ్ ఇది. దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని అప్పుడు గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఒక్క నెలలోనే ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ఈ కేసులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను సీబీఐ నిందితులుగా పేర్కొంది.