దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే దేశంలో 96,517 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,684,477కు చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? అనే అంశంపై కేంద్రం ఈ సందర్బంగా పలు కారణాలను వివరించింది.
ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాల్లో రోజూ భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడమే కోవిడ్ కేసులు పెరగడం వెనుక ఉన్న ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. చాలా మంది మాస్క్‌లను సరిగ్గా ధరించడం లేదని, కొందరు అసలు పూర్తిగా వాటిని ధరించడం లేదని పేర్కొంది. మాస్క్‌ను ముక్కు, నోరు, గడ్డం కవర్ చేసే విధంగా ధరించాలని, డబుల్ లేయర్ ఉన్న మాస్క్‌ను ధరించాలని కేంద్రం సూచించింది.
ఇక సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ప్రజలు కనీసం 1 మీటర్ దూరం ఉండే విధంగా తిరగాలని సూచించింది. గుంపులుగా వెళ్లవద్దని, మనిషికి, మనిషికి మధ్య కనీస దూరం ఉండాలని తెలిపింది. అలాగే శానిటైజర్లను ఎక్కువగా వాడాలని, మాస్క్ ధరించే ముందు, తీసేశాక చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించింది.