అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం కోసం కేంద్రం కసరత్తులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ తేలిపారు. ఇక తాజాగా అయోధ్యలో తలపెట్టిన రామమందిరం నిర్మాణానికి ఇచ్చే విరాళాలకు ఎటువంటి షరతులు వర్తించవని, అందువల్ల ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. వివాదాస్పద భూమిపై రామ్ లల్లాకే అధికారం దఖలు పరిచిన సుప్రీంకోర్టు స్వతంత్ర ట్రస్ట్ ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఆదేశాల మేరకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో ఈ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి విరాళంగా అందించి బోణీ కొట్టింది. ఈ విరాళాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నగదు, ఆస్తుల రూపంలో ఎలా ఇచ్చినా విరాళాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.