గడిచిన పది మాసాలుగా అనేక పథకాలు చేపట్టిన జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చే పరిస్తితి వచ్చింది. అనేక మార్లు కేంద్రంతోనూ.. ఆర్థిక సంఘం చైర్మన్‌లతోనూ జగన్ సర్కారు పెద్దలు పెట్టుకున్న మొర ఫలించింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చాయి. దీంతో ఇక, మరిన్ని కీలకమైన పథకాలను పరిగెట్టిం చాలని జగన్ భావించారు. అయితే, అనూహ్యంగా వచ్చిన కరోనా వైరస్ కారణంగా.. పరిస్తితి అతలాకుతలం అయి.. అనుకున్న విధంగా కాకుండా అదనపు ఖర్చులు పిడుగుల మాదిరిగా పడ్డాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకు రెవెన్యూ లోటు భర్తీ అయింది.
అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద ఏప్రిల్ నెలకు కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్ల విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది.
దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. తద్వారా ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం సహా అనావృష్టితో ఇబ్బంది పడుతున్న ప్రాంతా ల్లో ఈ నిదులు వెచ్చించాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆ నిధులను కరోనా ప్రభావం తగ్గించడంతోపాటు ఎక్విప్‌మెంట్లకు వినియోగించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీంతో జగన్ కృషి ఫలించినా.. కరోనా ఈ కష్టాన్ని మింగేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.