భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగరంలోని శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. అధికారులు ఈ రెండు వంతెనలను మూసివేసి రాకపోకలు నిలిపివేశారు.
మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద ప్రవాహం ప్రవహిస్తోంది. పోలీసులు వంతెనకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల అంబర్‌పేట్-మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, అంబర్‌పేట్, మలక్‌పేట్ పరిసర ప్రాంత వాసులను రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మూసానగర్, కమలానగర్‌ను మూసీ వరద నీరు చుట్టుముట్టింది.
మూసారంబాగ్ వంతెన సమీప లోతట్టు ప్రాంతాలైన మదర్సా, శంకర్‌నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనల మూసివేతతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.