ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆయనపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలు చర్చనీయంశంగా మారాయి. అధికార పక్షం ఇప్పుడు పవన్ ని లక్ష్యంగా చేసుకుని “చంద్రబాబు దత్తపుత్రుడు” అని వ్యాఖ్యానిస్తుంది. మంత్రులు పవన్ పై విమర్శలు చేసే సమయంలో ఇదే ఆరోపణ ఎక్కువగా చేస్తున్నారు.
విశాఖలో ఆయన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేసిన లాంగ్ మార్చ్ తర్వాత ఈ వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఆ విమర్శ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే… 2014 లో చంద్రబాబు ఆదేశాలతోనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్… ఆ తర్వాత నాలుగేళ్ళ పాటు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, శాలువాలు కప్పించుకుని ఆత్మీయుడిగా మెలగడం వంటివి చేసారు.
ఇక ఎన్నికలో ఏడాది ఉన్నాయి అనగా అనూహ్యంగా గేరు మార్చిన పవన్ కళ్యాణ్ గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు కుమారుడు లోకేష్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసారు. ఇక లోకేష్ వాటికి స్పంది౦చకపోగా పవన్ అంటే ఇప్పటికి గౌరవం ఉందని వ్యాఖ్యానించడం, పవన్ కళ్యాణ్ తనకు స్నేహితుడు అని వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం ఘోర ఓటమిని ఎదుర్కొన్నాయి. మళ్ళీ పవన్ ని వాడటానికి చంద్రబాబు సిద్దమయ్యారు.
ఆయనతో లాంగ్ మార్చ్ చేయించి ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. ఇందుకు తన పార్టీ సీనియర్ నేతలను కూడా పంపించి మళ్ళీ తన రాజకీయానికి పదును పెట్టారు. గత ప్రభుత్వ తప్పులను మాట్లాడని పవన్ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి గడువులు ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక బిజెపిని పొగిడే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా అదనం… ఈ విధంగా పవన్ ని చంద్రబాబు వాడుతున్నారని అందుకే ఆయన దత్తపుత్రుడు అయ్యారని అసలు లాంగ్ మార్చ్ ఆలోచన పవన్ ది కాదని చంద్రబాబుదని అంటున్నారు పలువురు.