శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఎస్ రావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మరికాసేపట్లో రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. బీఎస్ రావు పూర్తి బొప్పన సత్యనారాయణ రావు. బీఎస్ రావు దంపతులు ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించారు. అయితే.. డాక్టర్ బీఎస్ రావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపారు.
డాక్టర్ బీఎస్ రావు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తనను తాను విద్యారంగానికి అంకితం చేసుకున్నారని కొనియాడారు. ఆయన అందించిన ఘనతర వారసత్వం ఇకపైనా కొనసాగుతుందని, ఆయన సదా చిరస్మరణీయుడని కీర్తించారు. ఈ కష్టకాలంలో డాక్టర్ బీఎస్ రావు కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.