ప్రజలు తుమ్మినా, దగ్గినా సిఎం జగన్ మోహన్ రెడ్డి కారణమని ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శించే పరిస్తితి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా దానికి కారణం జగనే అనడం చంద్రబాబుకు బాగా అలవాటు అయిపోయింది. అంటే అన్నిటికీ జగనే బాబుకు కారణంగా కనిపిస్తున్నారు. అంటే జగన్ లేకపోత బాబు రాజకీయం చేయలేరని అర్ధమవుతుంది. అసలు జగన్ లేకపోతే బాబుకు రాజకీయ భవిష్యత్తే ఉండేలా కనిపించడం లేదు.
అంటే అంతలా జగన్‌ని టార్గెట్ చేసుకుని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే చాలు… అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే కనీసం ఆలోచన లేకుండా చంద్రబాబు మొదట జగన్ పేరునే ప్రస్తావిస్తూ ఆయనపై విమర్శలు చేస్తారు. తాజాగా దివంగత కోడెల శివప్రసాద్ రెండో వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, జగన్‌పై విమర్శలు చేశారు. అదేంటి ఆయన వర్ధంతి ఏంటి… బాబు ఏమో జగన్‌ని తిట్టడం ఏంటని డౌట్ రావొచ్చు.
ఇక్కడే ఒక లాజిక్ ఉంది… జగన్ అధికారంలోకి వచ్చాకే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీనికి పలు కారణాలు ఉన్నాయి. టిడిపి అధికారంలో ఉండగా కోడెల కుమారుడు, కుమార్తెలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో కే ట్యాక్స్ పేరిట ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ సామాగ్రిని కోడెల తన సొంతానికి వాడుకున్నారని విమర్శలు వచ్చాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చాక కోడెల ఫ్యామిలీపై అనేక కేసులు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలోనే కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఇక అక్కడ నుంచి కోడెలని జగన్ ప్రభుత్వమే హత్య చేసిందని చంద్రబాబు, టిడిపి నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అసలు కోడెల మీద కేసులు నమోదైనప్పుడు చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ, ఆయనకు సపోర్ట్‌గా నిలవలేదు. కోడెలకు బాబు ధైర్యం చెప్పే కార్యక్రమం చేయలేదు. కానీ చనిపోయాక మాత్రం జగన్ ప్రభుత్వమే చంపేసిందేని విమర్శలు మాత్రం చేస్తున్నారు.