బాబుగారి భ‌క్తుల వ్యూహం విక‌టిస్తోందా..?

-

క‌మ‌ల‌ద‌ళంలో విక‌సిస్తున్న బాబుగారి భ‌క్తుల వ్యూహం విక‌టిస్తోందా..?  బాబుగారి భ‌క్తుల వ్యూహాన్ని ప‌సిగ‌ట్టిన క‌మ‌లం పెద్ద‌లు వారిని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతున్నారా..?  అందుకే చంద్ర‌బాబు ఆల‌పిస్తున్న స్నేహ‌గీతాన్ని ఏమాత్ర‌మూ ప‌ట్టించుకోవ‌డం లేదా..? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. అదేమిటోగానీ.. పొత్తులు పెట్టుకోవ‌డంలో.. ఎత్తిపొడ‌వ‌డంలో.. మ‌ళ్లీ పొత్తు బేర‌సారాలు న‌డుప‌డంలో బాబుగారిని మించినవారు లేరంటే అతిశ‌యోక్తిలేదేమో..! అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మాట‌ను మ‌డ‌త‌వేయ‌డంలోనూ ఆయ‌న‌ది అందెవేసిన చెయ్యి.

తాజాగా.. ఏపీలో మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి న‌డిచేందుకు బాబుగారు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అందులోనూ బీజేపీలో ఉన్న బాబుగారి భ‌క్తుల చుట్టూ ఈ చ‌ర్చ తిరుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ క‌లిసి పోటీ చేసి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్యం అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామ్యం అయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేదంటూ మూడేళ్ల త‌ర్వాత బాబుగారు బీజేపీతో బంధం తెంచుకుని బ‌య‌ట‌కు రావ‌డం.. ఆ త‌ర్వాత ధ‌ర్మ‌పోరాటం చేయ‌డం అంద‌రికీ తెలిసిందే.

ఇక ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగానే పోటీ చేసి చావుదెబ్బ తిన్న‌ది. వైసీపీ ధాటికి త‌ట్టుకోలేక విల‌విల‌లాడింది. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే టీడీపీకి చెందిన ప‌లువురు రాజ్య‌స‌భ స‌భ్యులు, ఇత‌ర నేత‌లు బీజేపీలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డే ఆస‌క్తిక‌ర‌మైన టాక్ వినిపించింది. సుజ‌నాచౌద‌రి త‌దిత‌రుల‌ను బాబుగారే పంపించార‌ని, వీరంతా కోవ‌ర్టుల‌నే టాక్ బ‌లంగా వినిపించింది. వీరంతా కూడా అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు బీజేపీతో బంధం క‌లిపేందుకు ప‌నిచేస్తార‌ని కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది.

ఇప్పుడు బీజేపీతో క‌లిసి న‌డిచేందుకు చంద్ర‌బాబు మ‌ళ్లీ స్నేహగీతిక ఆల‌పిస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇందుకోసం బీజేపీలోని బాబుగారి భ‌క్తులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే విష‌యాన్ని ప‌సిగట్టిన క‌మ‌లం పెద్ద‌లు.. చంద్ర‌బాబు భ‌క్తుల్ని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతున్నట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో బీజేపీ టీడీపీ బంధంపై వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ హై కమాండ్ భావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఏపీకి వచ్చి మరీ క్లారిటీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ దగ్గర ఏముంది కలవడానికి అని కూడా ఆయన సెటైర్లు పేల్చ‌డం తెలిసిందే. బాబు విశ్వసనీయత లేని నాయకుడని, టీడీపీకి చిత్తశుద్ధి లేదని కూడా ఆయన హాట్‌ హాట్ కామెంట్స్ చేశారు. మ‌రో అడుగుముందుకు వేసి.. టీడీపీని విలీనం చేస్తానంటే తానే స్వయంగా మాట్లాడుతానని కూడా జీవీఎల్ అన‌డంతో బాబుగారి భ‌క్తులు కంగుతిన్నార‌ట‌. ఇక ఇటు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం బాబు విశ్వాస ఘాత‌కుడు అని… టీడీపీకి బీజేపీ శాశ్వ‌తంగా డోర్లు క్లోజ్ చేసేసింద‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌య‌త్నాలు ఫ‌లించే ఛాన్స్ లేక‌పోడంతో బీజేపీలో బాబు భ‌క్తులు సైలెంట్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news