తీరు మార్చుకోండి.. లేకపోతే తీవ్ర పరిణామాలు: చంద్రబాబు

గుంటూరు: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డెయిరీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ధూళిపాళ్ల నరేంద్రకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రజలు కూడా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజద్రోహం కేసులో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.