తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి… టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో… ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టగా తాజాగా… మరో కంపెనీ సిద్ధమైంది. ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను సింగపూర్ హై కమీషనర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గురించి మంత్రి కేటీఆర్ పలు వివరాలు వారికి తెలియజేశారు.
హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నదని, ఇక్కడ అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా పని చేస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగిగామని ఈ సందర్భంగా కేటిఆర్ హై కమిషనర్కు వివరించారు.
తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డిబిఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూల ఫీడ్బ్యాక్ని అందించాయని హై కమిషనర్ మంత్రి కేటీఆర్ కు తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటి, ఇన్నోవేషన్, ఐటి అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు.
హైదరాబాదులో ఉన్న టి హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటి ఈకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతలు తెలుసన్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాలు పట్ల ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.