ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జులు లేక ఏడాది దాటింది. అయినా కొత్తవారు రాలేదు. అసలు వస్తారో రారో కూడా తెలియదని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. బలమైన కేడర్ ఉన్న చోట పార్టీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది.చంద్రబాబు ఆ రెండు నియోజకవర్గాలను లైట్ తీసుకున్నారా ..తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న రామచంద్రాపురం,పి.గన్నవరంలో ఏం జరుగుతుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి కార్యకర్తలే దిక్కయ్యారు. ఇంఛార్జులు.. నేనున్నాను అని చెప్పే నాయకులు అక్కడ లేరు. ఏడదిన్నరగా ఇదే తంతు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. అక్కడ బలమైన నాయకుల కోసం టీడీపీ అధిష్ఠానం అన్వేషిస్తున్నా ఆ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉందట. ఈ రెండు చోట్లా టీడీపీ కార్యక్రమాలు చేపట్టాలంటే పార్టీ శ్రేణులే పూనుకుంటున్నాయి. పార్టీపై అభిమానం చంపుకోలేక.. మరో పార్టీ జెండా మోయలేక ఏదో అలా నెట్టుకొచ్చేస్తున్నారు తమ్ముళ్లు.
స్థానిక ఎన్నికల ప్రక్రియ పట్టాలెక్కే సమయానికి ఇంఛార్జులు వస్తారో రారో కూడా చెప్పడం లేదట జిల్లా నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొద్దిరోజులకే రామచంద్రపురంలో సైకిల్ దిగేశారు తోట త్రిమూర్తులు. వైసీపీలో చేరి.. పక్క నియోజకవర్గం మండపేటకు కోఆర్డినేటర్‌గా ఉన్నారు. 1994 నుంచి రామచంద్రపురంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు తోట త్రిమూర్తులు. మధ్యలో ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లకు ఆయన వెళ్లిన సమయంలోనూ ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడు దొరకలేదు. ఆయనే తిరిగి టీడీపీకి వచ్చిన తర్వాత మళ్లీ పార్టీ గాడిలో పడింది. ఇప్పుడు రెండోసారి టీడీపీకి గుడ్‌బై చెప్పారు తోట. అమలాపురంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలోనే సమావేశాలు పెడుతున్నాయి పార్టీ శ్రేణులు.
పి.గన్నవరంలో పార్టీని నడిపించే నాయకుడు లేకపోయినా పదవుల కోసం రెడ్డెక్కే నేతలకు కొదవ లేదు. అయినవిల్లి మండల టీడీపీ అధ్యక్షుడి నియామకం విషయంలో ఇదే జరిగింది. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి టికెట్ నిరాకరించి స్టాలిన్‌బాబుకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై ఆరోపణలు రావడంతో స్టాలిన్‌బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇంఛార్జ్ లేకుండా పోయారు.
ఇప్పటికే జరిగిన జాప్యం ఎలాగూ జరిగింది. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ధీటైన వారిని ఇంఛార్జ్‌గా టీడీపీ ఎంపిక చేయగలదా అని ఆలోచిస్తున్నారట తమ్ముళ్లు. ఒకవేళ యువనాయకత్వంవైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపితే.. రామచంద్రపురం టీడీపీ ఇంఛార్జ్‌గా పారిశ్రామిక వేత్త దూడల శ్రీనివాసరావు, పి.గన్నవరం ఇంఛార్జ్‌గా వైసీపీలో టికెట్ రాక ఆ పార్టీకి రాజీనామా చేసిన మందపాటి కిరణ్‌కుమార్‌ను ఎంపిక చేయవచ్చిన అనుకుంటున్నారు. మరి.. చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.