ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ బిశ్వా భూషణ్ హరి చంద్ ని రాజ్ భవన్ లో కలిసారు. రాజభవన్ లో గవర్నర్ ని కలిసిన చంద్రబాబు నాయుడు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. బుధవారం మాచర్లలో జరిగిన పరిణామాలు, టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను చింపడం వంటి వాటిని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళారు.
ఏపీలో ఎన్నికల కమిషన్ అధికారులు ప్రభుత్వం చేతిలో బొమ్మల్లా వ్యవహరిస్తున్నారని, పోలీసులు సైతం శాంతి భద్రతల పరిరక్షణకు పక్కన పెట్టేసి అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారని గవర్నర్ కి చంద్రబాబు ఫిర్యాదు చేసారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ జరుగుతున్న స్థానిక సంస్థలపై దృష్టి సారించాలని, తగిన విధంగా స్పందించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అప్రమత్తం చేయాలని చంద్రబాబు గవర్నర్ ని కోరారు.
గవర్నర్ నుంచి ఎం స్పందన వచ్చింది అనే విషయం మాత్రం స్పష్టత లేదు. అదే విధంగా దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఆయన గవర్నర్ కి ఇచ్చినట్టు సమాచారం. మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు కొందరు విరుచుకుపడిన విధానాన్ని సాక్ష్యాలతో సహా చంద్రబాబు వివరించారు. చర్యలు తీసుకోవాలని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చెయ్యాలని ఆయన గవర్నర్ కి విజ్ఞప్తి చేసారు.