టీడీపీని లైన్‌లో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ముందు చూపుతో ఆయన వ్యవహరించారు. ఎలాగూ మరో ఏడాదిలో రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలు జిల్లాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనిని గమనించిన చంద్రబాబు అప్పుడు మార్పులు చేర్పులు చేస్తే.. ఇబ్బందేనని గ్రహించి.. ఇప్పుడే పార్లమెంటు వారీగా.. పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి.. ఇంచార్జ్‌లను నియమించారు. కీలక నేతలతో పాటు.. సీనియర్లు, జూనియర్లకు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో పునరుత్తేజం వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఇక, ఇప్పుడు ఆయన చూపు నియోజకవర్గాలపై పడనుందని అంటున్నారు పార్టీలోని సీనియర్లు. ప్రధానంగా పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ గత ఏడాది ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడాన్ని బాబు సీరియస్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాలను విభజించి.. ఎక్కడ ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలో పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేదు. దీంతో వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు.
అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేదు. ఈ పరిణామాలతో .. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇక, టీడీపీకి కంచుకోటలే అయినప్పటికీ.. గత ఏడాది ఎన్నికల్లో చాలా చోట్ల పరాభవం ఎదురైంది. ఆయా నియోజకవర్గాల్లోనూ పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ తరఫున ఎలాంటి పిలుపు ఇచ్చినా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అదే సమయంలో నియోజకవర్గాల్లోనూ ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించడం లేదు. ఇలాంటి వారిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించేందుకు కూడా బాబు యోచిస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. అయితే, దీనికి గాను మరికొంత సమయం పడుతుందని.. ఖచ్చితంగా నియోజకవర్గాలపై దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారని సీనియర్లు చెబుతుండడంతో నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
-Vuyyuru Subhash