విజయవాడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నేత వంగవీటి రాధా రాజకీయం అగమ్యగోచరంగా మారింది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ? కూడా తెలియడం లేదు. కాంగ్రెస్‌తో ప్రారంభమైన వంగవీటి రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత ప్రజారాజ్యం వయా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ తిరిగి టీడీపీతో కొనసాగుతోంది. రాధా పేరుకు మాత్రమే టీడీపీలో ఉన్నా చేసేదేం లేదు. గత ఎన్నికల్లో జగన్ సెంట్రల్ సీటు ఇవ్వనని పెండింగ్ పెట్టడంతో రాధా అలిగి బయటకు రావడంతో పాటు తన తండ్రి ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ఉన్నాడో అదే టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన రాధా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడంతో రాధా పార్టీలో ఉంటాడా ? బయటకు వచ్చేస్తారా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే రాధా మధ్యలో జనసేన సమావేశానికి వెళ్లడంతో ఆయన అభిమానులు అయితే తలలు పట్టుకోవడంతో పాటు రాధా మళ్లీ పవన్ చెంతకు చేరతాడా ? ఏంటని జోకులు వేసుకున్నారు. తాజాగా రాధా రాజధాని అమరావతి రైతుల తరపున బలంగానే ఉద్యమిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలపడంతో పాటు అక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ రాధా టీడీపీతో సంబంధం లేకుండానే కంటిన్యూ చేస్తున్నారు. రాధా ఆలోచన ఎలా ఉన్నా బాబు మాత్రం రాధాకు అవనిగడ్డ అసెంబ్లీ ఇన్‌చార్జ్ పగ్గాలు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటికే పార్టీలో యాక్టివ్‌గా ఉండడం లేదు.
ఈ క్రమంలోనే రాధాను అవనిగడ్డకు పంపాలని చూస్తున్నారట. మరి రాధా బాబు ఆఫర్‌కు ఒప్పుకుని టీడీపీలో ఉంటారా ? లేదా మళ్లీ వైసీపీ గూటికో లేదా బీజేపీలోకి వెళ్లినా వెళ్లిపోవచ్చనే ప్రచారం రాధా టార్గెట్‌గా నడుస్తోంది. మరి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ? చూడాలి.
-vuyyuru subhash