కంగారు పడుతున్న బాబు, ఎంపీలకు ఏం చెప్పారంటే…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా సరే మండలి రద్దుని ఆపే విధంగా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా అయినా సరే ఈ బిల్లు చర్చకు రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు.

దీనితో తన పార్టీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు కీలక సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన ఈ సూచనలు చేసారు. కక్ష సాధింపు ధోరణితో జగన్ మండలిని రద్దు చేసారనే విషయం కేంద్రానికి చెప్పాలని ఎంపీలకు సూచించారు. అదే విధంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారట. రాజధాని మార్పు విషయాన్ని, అమరావతి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

రాజధాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు, రైతుల పోరాటాలను, పార్లమెంట్ ద్వారా దేశం దృష్టికి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యంపైనా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. సీఏఏపై ఆయా వర్గాల్లో ఆందోళనలకు అనుగుణంగా సభలో వ్యవహరించాలని, నరేగా బిల్లుల చెల్లింపులో రాష్ట్రం వైఖరిని కేంద్రం దృష్టికి తేవాలని సూచించారు.

అదే విధంగా రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. పోలీసుల అక్రమ నిర్బంధం, తప్పుడు కేసులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇదిలా ఉంటే మండలి రద్దు బిల్లు నేడు కేంద్ర హోం శాఖకు చేరింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news