దేశంలో 2 దశాబ్దాల కిందట వరకు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన సలహాదారుల వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పాకింది. గత దశాబ్ద కాలంగా ఈ సలహాదారుల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వాలకు పెరిగిపోయింది. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కొన్ని కొన్ని అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు , లేదా ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు మార్గం అన్వేషించేలా సలహాదారులను నియమించుకునే వ్యవస్థ మంచిదే. అయితే, ఇలా సలహాదారులుగా నియమితులు అయ్యే వ్యక్తులు ఆయా రంగాల్లోనిష్ణాతులు అయిన చరిత్ర ఉండాలనేది కనీస ధర్మం. అందుకే కొన్నేళ్ల కిందట వరకు కూడా కేవలంమాజీ ఐఏఎస్‌లు, రిటైర్డ్ జడ్జిలు, మాజీ ఐపీఎస్‌లను మాత్రమే సలహాదారు లుగా తీసుకునేవారు.
ఇలా నియమితులైన వారి సంఖ్య కూడా పరిమితంగా ఉండేది. అయితే, గత 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ లైన్ చెడిపోయిన మాట వాస్తవం. సలహాదారుల వ్యవస్థను కూడా బాబు రాజకీయ కోణంలోనే చూడడం ప్రారంబించారు. కుటుంబ రావు వంటి అప్పటి వరకు ప్రజలకు తెలియని, లేదా ప్రజా సేవలో లేని వ్యక్తిని తీసుకు వచ్చిన సలహాదారుగా నియమించుకు న్నారు. అదేవిధంగా ప్రజారాజ్యం నుంచి వచ్చి పార్టీలో చేరిన పరకాల ప్రభాకర్‌కు కూడా సలహాదారు పోస్టు ఇచ్చేశారు.
ఇలా అత్యంత కీలకమైన వ్యవస్థలో రాజకీయ నేతలను, లేదా తనకు అనుకూలంగా వ్యవహరించిన వారికి పోస్టులు కట్టబెట్టారు. దీంతో ఈ వ్యవస్థ గాడి తప్పింది. నిజానికి ఇప్పటికీ.. తెలంగాణ విషయాన్ని తీసుకుంటే.. అక్కడ ఉన్న 10 మంది సలహాదారుల్లో ఆరుగురు మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్ జడ్జిలే కావడం గమనార్హం. కానీ, మన దగ్గర మాత్రం ఈ వ్యవస్థ గత చంద్రబాబు హయాంలోనే గాడి తప్పింది. దీంతో సలహాదారులు అంటే.. తెల్ల ఏనుగులు అనే నానుడి బాబు హయాంలోనే వినిపించింది. ఇక, ఇదే సంస్కృతి.. జగన్ హయాంలోనూ కొనసాగడం గమనార్హం.
ప్రస్తుతం జగన్ సర్కారులో లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదారులు, కేబినెట్ హోదాలో ఉన్న సలహాదారులు కూడా ఎలాంటి ప్రజాజీవితంతోనూ సంబంధం లేనివారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అజేయకల్లం, పీవీ రమేష్ వంటి ఓ నలుగురు తప్ప.. మిగిలిన వారంతా కూడా గతంలో జగన్ ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తమ వంతు పాత్ర పోషించిన వారే తప్ప.. మరే క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు ఇదే ఘోరమైందని టీడీపీ కన్నీరు పెడుతోంది. కానీ, వ్యవస్థను నాశనం చేసిన విషయాన్ని మరిచిపోవడం గమనార్హం.