ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్‌ల టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు లాగా కనిపిస్తున్నారు. ఆయనని టార్గెట్ చేస్తేనే బెనిఫిట్ అవుతుందనే కోణంలోనే కేసీఆర్, జగన్‌లు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తెలంగాణ, ఏపీ నేతలు ముందుకు వెళ్తున్నారు.
ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. కాదు ఈ ప్రాజెక్టు సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం పలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అలాగే శ్రీశైలం, పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్నారని సీఎం జగన్, ఏపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తోంది.
అయితే గతంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు ఏం చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయనవల్లే రాయలసీమ ఎడారిగా మారుతుందని అంటున్నారు. అలాగే టిడిపి ఎమ్మెల్యేలతో రాయలసీమ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు చేస్తున్నారని అంటున్నారు. ఇలా చంద్రబాబుని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రాయలసీమ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా ఎడారి అవుతుందని, సీఎం జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక దీన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.
ఇలా వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తుంటే అటు తెలంగాణలో టిఆర్ఎస్ నేతలు చంద్రబాబుని మరో రకంగా టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి రావడానికి కారణం చంద్రబాబు అని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ అధిష్టానాన్ని మేనేజ్ చేసి రేవంత్‌కి పీసిసి ఇప్పించారని విమర్శిస్తున్నారు. కాంగ్రెసులో ముసుగులో మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని మాట్లాడుతున్నారు.
ఇలా చంద్రబాబుని టార్గెట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది. అదే సమయంలో టిఆర్ఎస్‌కి లబ్ధి చేకూరుతుంది. అందుకే టిఆర్ఎస్ నేతలు చంద్రబాబు ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇక నీటి వివాదంలో చంద్రబాబుని లాగి వైసిపి లబ్ది పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబే, కేసీఆర్-జగన్ లకు ప్లస్ అయ్యేలా ఉన్నారు.