ఏపీ రాజధాని అమరావతిని కీలకంగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఇది మూడు ముక్క లుగా మారుతుండడంతో తట్టుకోలేక పోతున్నారనేది వాస్తవం. జగన్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ చేప ట్టి.. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అమరావతి రూపు రేఖలు మారిపోవడం ఖాయమని భావించిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాకముందుగానే ప్రజలను సమాయత్తం చేసి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు., ఆయన చేయాల్సింది అంతా చేశారు. జోలె పట్టారు. కేంద్రంపై ఒత్తిడి పెంచారు. తన అనుకున్నవారిని అందరినీ రంగంలోకి దింపారు.
మరీ ముఖ్యంగా తన పాత మిత్రుడు పవన్‌తోనూ ప్రకటనలు చేయించారు. బీజేపీ నేతలను కూడా లోపాయి కారీగా బుజ్జగించి అమరావతికి అనుకూలంగా వ్యవహరించేలా కామెంట్లు చేసేలా చేశారు. ఇక, పలు ప్రాంతా ల్లో పర్యటించి అమరావతికి అనుకూలంగా వారితో జై కొట్టించుకున్నారు. ఇంత జరిగిన తర్వాత 50 రోజుల ఉద్యమం తర్వాత కూడా చంద్రబాబు ఆశించిన ఫలితం దక్కకపోగా.. తాను ఎవరినైతే అస్త్రాలుగా భావిం చారో.. ఆ అస్త్రాలు నేడు జారిపోవడంతో ఉసూరు మంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
గడిచిన నాలుగు రోజు లు గా రాజధానిపై ఒక్కమాట కూడా మాట్లాడలేని పరిస్తితిలో చంద్రబాబు కూరుకుపోయారు. పవన్ లాంటి వాళ్లు పిలుపు ఇస్తే.. యువత కదిలి వస్తారని భావించిన చంద్రబాబు ఆదిలో ఆయనపై నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే, ఆయన ఎవరి సూచనలతో బీజేపీలో చేరారోకానీ, ఇప్పుడు కేంద్రం రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేదని తెలిసిన తర్వాత తన పంథాను మార్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా తమ వ్యూహాలను మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. కేవలం రాజధాని రైతులకు అన్యాయం జరగరాదనే ఒక్క డిమాండ్ తప్ప రాజధాని తరలింపు వ్యతిరేక నినాదాలను పక్కన పెట్టారు.
దీంతో రాష్ట్రంలో చంద్రబాబుకు కలిసి వచ్చే పార్టీలు లేవనే చెప్పారు. ఇక్కడే మరో గమ్మత్తు ఏంటంటే.. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు వెంటే నడిచిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు పంథా మార్చుకున్నాయి. తాము హోదా కోసం ఫైట్ చేస్తామని చెప్పాయే కానీ, రాజధానులపై మౌనం వహించాయి. మొత్తంగా కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పి ఏదో సాధిస్తారని అనుకున్నా.. ఇప్పుడు పూర్తిగా అన్ని అస్త్రాలు వీగిపోవడంతో ఆయన చేతులు ఎత్తేసిన పరిస్థితి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.