వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలో ఉన్న వైసీపీ బలంగా ఉన్న నేపధ్యంలో ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంది. అయితే అనుకున్న విధంగా కొన్ని పరిస్థితులు ఆ పార్టీకి కలిసి రావడం లేదనే భావన ఉంది. ప్రధానంగా బిజెపి తో కలిసి తెలుగుదేశం పార్టీ వెళ్ళే ఆలోచనలో ఉండటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ వినపడుతుంది.
పార్టీ నేతలతో కనీసం చర్చించకుండా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అటు సిఎం జగన్ బిజెపి తో కలిసి ఉన్నారని విమర్శిస్తూనే… ఇదేం రాజకీయం అంటూ మండిపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చంద్రబాబు వైఖరి అర్ధం కాని విధంగా ఉంది. పార్టీ విషయంలో కష్టపడిన నాయకులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. బిజెపి తో కలిసి వెళ్తే ఆ పార్టీ కి ఇచ్చే సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తారని ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన నాయకుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంచితే లోకేష్ యాత్ర ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది. ఇప్పటి వరకు యాత్ర కోసం ఖర్చు పెట్టిన నాయకుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినపడుతుంది. ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే పొత్తులు అవసరమే కాని… ఇలాంటి చర్యలతో పార్టీ అధిష్టానం మీద కార్యకర్తల్లో నమ్మకం పోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం పార్టీకి వీస్తున్న కొద్దో గొప్పో అనుకూల పవనాలను చంద్రబాబు నాయుడు తొందరపాటుతో నాశనం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.