టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జవహర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గుర్తించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో దూకుడుగానే ఉన్నారు. 2014లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన జవహర్.. టీడీపీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఇది టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎవరు నిలబడినా.. వ్యక్తులతో సంబంధం లేకుండా టీడీపీనే గెలిపిస్తున్న హిస్టరీ ఉంది. అలాంటి చోట జవహర్ విజయం సాధించారు.
అయితే, ఎంత పార్టీ బలం ఉన్నప్పటికీ.. నాయకుడిగా జవహర్ పైనా నాయకులు, కార్యకర్తలు ఆశలు పెట్టుకుంటారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో నాయకులందరిని ఒకే తాటిమీదకు తేలేకపోయారు. ఆయనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వల్ల ఎస్సీ కమ్యూనిటీతో పాటు పార్టీలోనూ ఆయనకు మంచి పేరే వచ్చినా స్థానికంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయనను వేరే చోటకి మార్చాలని పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. దీంతో చంద్రబాబు ఆయనను కృష్ణా జిల్లా తిరువూరుకు బదిలీ చేశారు.
ఇక, ఇక్కడ ఓడిపోయారు. ఇదిలావుంటే, కొవ్వూరు నుంచి పోటీ చేసిన టీడీపీ నాయకురాలు.. వంగలపూడి అనిత ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె తాను కొవ్వూరులో ఉండబోనని చెప్పి.. విశాఖకు వెళ్లిపోయారు. మరోపక్క, జవహర్.. తన నియోజకవర్గం ఎలాగూ ఖాళీగా ఉంది కనుక తనను అక్కడకే పంపాలని చంద్రబాబుకు విన్నవిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమీ తేల్చలేదు. ప్రస్తుతం కొవ్వూరులో టీడీపీని నడిపించే నాయకులు ఎవరూ కనిపించడం లేదు.
పోనీ.. అధికార పార్టీ అయినా దూకుడుగా ఉందా? అంటే అది కూడా లేదు. అక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్న తానేటి వనిత వల్ల నియోజకవర్గానికి ఒరిగిందేమి లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరుకు జవహర్‌ను పంపించడం ద్వారా ఇక్కడ మళ్లీ పార్టీ పుంజుకునే అవకాశంతో పాటు.. అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.