కృష్ణా జిల్లా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న జిల్లా. టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లా బాగానే ఉపయోగపడుతోంది. అధికారం లేకపోయినా సరే జిల్లాలో టీడీపీ బలంగానే ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ వీక్ అయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లోనే టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. మళ్ళీ అందులో వల్లభనేని వంశీ టీడీపీని వీడారు. దీంతో టీడీపీకి గద్దె రామ్మోహన్ ఒక్కరే మిగిలారు. ఇక విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు.
అయితే ఓటమి పాలయ్యాక చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. రాజధాని అమరావతి లాంటి బలమైన అస్త్రాన్ని పెట్టుకుని కూడా నేతలు రాజకీయంగా పుంజుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఏదో కొందరు నేతలు మాత్రం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, అమరావతికి మద్ధతుగా ఉంటున్నారు. కానీ మిగిలిన నేతలు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. దీని వల్ల కృష్ణాలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జెండా కట్టే నాయకుడే ఉండటం లేదు.
అమరావతికి దగ్గరగా ఉన్న నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తూర్పు, సెంట్రల్, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గట్టిగానే నిలబడుతున్నారు. ఇటీవలే జైలు నుంచి వచ్చిన కొల్లు రవీంద్ర మళ్ళీ బందరులో యాక్టివ్ అయ్యేందుకు చూస్తున్నారు. ఇక పెడనలో కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తున్నారు. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు అయితే ఇంటి నుంచి బయటకే రావడం లేదు.
పామర్రులో ఉప్పులేటి కల్పన, అవనిగడ్డలో మండలి బుద్ద ప్రసాద్‌లు కంటికి కనబడటం లేదు.
ఇక గన్నవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదు. తిరువూరులో జవహర్, నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావులు అలా అలా బండి లాగిస్తున్నారు. కైకలూరులో జయమంగళ పర్వాలేదనిపిస్తున్నారు. ఇక ఇలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ చాలా గడ్డు పరిస్థితి ఎదురుకుంటుంది. చంద్రబాబు గనుక పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే, పార్టీ ఇక్కడ మరింత డేంజర్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఏదేమైనా బాబు కృష్ణా సైకిల్‌కు రిపేర్లు చేయకపోతే తుప్పు పట్టడం ఖాయమే అని టీడీపీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.
-సూర్య