తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానిక ఓటమి నుంచి బయటపడడానికి ఉప పోరు ఒక వేదికలా భావిస్తోంది టీడీపీ. ఎన్నికల వ్యవహారంపై నిత్యం సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు అగ్రనేతలు అంతా ప్రచారంలో ఉంటారని స్పష్టం చేశారు. మరోవైపు వాలంటీర్ల, ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలపై ఫిర్యాదులకు లీగల్ టీంను ఏర్పాటు చేశారు. ప్రచారాన్ని కో ఆర్డినేట్ చేయడానకి పార్టీ కార్యాలయంలో సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
స్థానిక ఓటమినుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటింగ్ శాతం తగ్గిపోయి డిఫెన్స్‌లో ఉన్న పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఉప పోరును పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల ప్రచారంపై రోజు వారీ సమీక్షలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రచారం, ఎన్నికల వ్యవహారాల కోసం ఇప్పటకే 5 గురితో కమిటీ వేసిన చంద్రబాబు..కేంద్ర పార్టీ కార్యాలయంతో సమన్వయం బాద్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.
వర్ల రామయ్య, బోండా ఉమా, టీడీ జనార్థన్లకు ఈ పని అప్పగించారు. రోజు వారీ ప్రచారంతో పాటు ఫిర్యాదులు, సమస్యలపై ఎప్పటికప్పుడు ఈ సమన్వయ కమిటీ స్పందించాలని చంద్రబాబు సూచించారు. అచ్చెన్న, లోకేష్, యనమలతో పాటు అన్ని ప్రాంతాల సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మరోవైపు టీడీపీ తరఫున పోటి చేస్తున్న పనబాక లక్ష్మీ ప్రత్యేక హోదా అంశంతో ప్రజలను కలుస్తున్నారు.
ఇక ప్రతి నియోజకవర్గానికి ఒక న్యాయవాదిని పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ నేతలు వారి పై ఈసీకి, ఉన్నతాధికారులకు లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదులు ఇవ్వాలని నిర్ణయంచారు. దీని కోసమే 7 నియోజకవర్గాలకు న్యాయవాదులను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాతో పాటు..స్థానిక సమస్యలపై కరపత్రాలతో ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచనలు ఇచ్చారు.
లోకేష్‌తో పలు అసెంబ్లీ నియోజవకవర్గాల్లో ర్యాలీలు పెట్టాలి అనే అంశంపైనా నేతలతో సమాలోచనలు చేస్తున్నారు చంద్రబాబు. మొత్తంగా చూసుకుంటే ఉప పోరును టీడీపీ చాలా సీరియస్ గానే తీసుకుంది.