వరుస షాకులతో విలవిల్లాడుతున్న మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు బిజెపి ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ పట్టుకుందట. అదేంటి సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు చంద్రబాబుకు లింక్ ఏంటి ?బాబు ఎందుకు ? టెన్షన్ పడుతున్నారు అన్నది పరిశీలిస్తే ఆసక్తికరమైన రాజకీయ విషయాలు వెల్లడవుతాయి. సీఎం రమేష్ ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు దయతోనే ఆయన టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన బీజేపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సిఎం రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్‌మెంట్‌లో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ నిశ్చితార్థ వేడుకలకు పలువురు ప్రముఖ నేతలు, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు వెళుతున్నారు. నిశ్చితార్థ వేడులకు వెళితే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అక్కడ కూడా రాజకీయ పరమైన చర్చలకు తెరదీస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా కొందరు సీఎం రమేష్ నిశ్చితార్థ వేడుకలకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరెవరు ? ఎక్కడ ఉన్నారు… ఏ పనిమీద వెళ్లారు… ఏ ఎమ్మెల్యే కదలికలు అనుమానంగా ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారట.
ఈ క్రమంలోనే దుబాయ్ వెళ్లిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు టీం ప్రత్యేకంగా నిఘా పెట్టిందట. ఇక గంటా శ్రీనివాసరావు దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తోంది. గంటా కదలికలు కొద్ది రోజులుగా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వెళతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గంటాతో పాటు ఉత్తరాంధ్రకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారన్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజులుగా సీఎం రమేష్ బీజేపీలోకి ఇతర పార్టీలకు చెందిన వాళ్లను తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడిని కాంగ్రెస్‌కు రాజీనామా చేయించి బీజేపీలోకి తీసుకు వెళ్లడంలో రమేష్ పాత్రే కీలకం. ఈ క్రమంలోనే గంటాతో పాటు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సైతం అక్కడ పార్టీ మారే డీల్ సెటిల్ చేసుకుని వస్తారన్న వార్తలు బాబును మరింత టెన్షన్ పెట్టేస్తున్నాయట.
అందుకే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో నిత్యం ఫోన్లో టచ్‌లోకి వెళ్లే బాధ్యతను ఓ సీనియర్ నేతకు అప్పగించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు సుజనా చౌదరి సైతం 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. వారు అవసరం వచ్చినప్పుడు పార్టీ మారతారని చెప్పడం కూడా పార్టీ నాయకత్వాన్ని, శ్రేణులను కలవర పెడుతోంది.