రాష్ట్రంలో ఓ వర్గం మీడియా ఆసక్తికర చర్చను తెరమీదికి తెచ్చింది. ఏపీ సీఎం జగన్‌కు వాస్తు పిచ్చి ఉందని.. అందుకే కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారని తాజాగా వెల్లడించిన సమాచారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వాస్తు పిచ్చి అనేది గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుదా? లేక వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌దా? అనే చర్చ మొదలైంది. విషయంలోకి వెళ్తే.. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గేట్లకు అడ్డంగా గోడలు కడుతున్నారు. ఏపీ సచివాలయం చుట్టూ ఆరు గేట్లున్నాయి. అందులో నాలుగు గేట్లు సచివాలయ నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయగా, వాస్తు కోసమంటూ ఏడాదిన్నర కిందట గత ప్రభుత్వం మరో రెండు గేట్లను అమర్చింది.
అయితే, ఇప్పుడు ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం ఆ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణానికి పూనుకుంది. సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్న గేటుకు, దానికి ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు అడ్డంగా సీఆర్డీఏ అధికారులు గోడలు నిర్మిస్తున్నారు. అలాగే, సచివాలయం వైపు నుంచి అసెంబ్లీకి వెళ్లే అసెంబ్లీ అయిదవ గేటుకు అడ్డంగా గోడకట్టనున్నట్లు పలువురు చెబుతున్నారు. గోడ నిర్మాణానికి కావలసిన రాళ్లను కూడా ఇప్పటికే అక్కడికి చేర్చారు.
అసెంబ్లీ వర్గాల నుంచి అధికారిక అనుమతులు ఇంకా రావాల్సి ఉందని, రాగానే అక్కడా గేటుకు అడ్డంగా గోడ కట్టనున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. గేట్లు ఉంటుండగానే ఈ నిర్మాణాలు చేపట్టడం విశేషం. ఇక, ఈ కార్యక్రమానికి కూడా కొందరు జగన్ వ్యతిరేకులు తమ పైత్యం పూసేశారు. జగన్ వాస్తు పిచ్చిలో భాగంగానే ఇలా గేట్లకు గోడలు కడుతున్నారని చెప్పుకొస్తున్నారు. నిజానికి జగన్ కు ఎలాంటి వాస్తు పిచ్చీ లేదు. గతంలో చంద్రబాబు వాస్తును బాగానే నమ్మేవారు. అందుకే ఆయన రాజధాని ఏర్పాటు నుంచి సచివాలయం నిర్మాణం వరకు కూడా అన్నీ వాస్తుచూసుకుని, ఈ వాస్తు.. తనకు, తన పాలనకు అనుకూలంగా చూసుకుని ప్రతి అడుగు ముందుకు వేశారు.
ఈ క్రమంలోనే కృష్నానదిని ఆనుకుని రాజధాని నిర్మిస్తే.. ఈశాన్య దిక్కున, ఉత్తరం వైపు నదీజలాలు నిత్యం పారతాయి కాబట్టి అధికారానికి ఢోకా ఉండదని, చంద్రబాబు జీవించినంత కాలం ఆయనే అధికారంలో ఉంటారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాదు, చంద్రబాబు హయాంలో ఇక్కడ సచివాలయం విషయానికి వస్తే.. ఇక్కడ కూడావాస్తు మేరకు రెండు గేట్లు అదనంగా నిర్మించుకున్నారు. బాబుకు ఇంత వాస్తు పిచ్చి ఉంటే.. జగన్‌కు అంటగట్టడం సమంజసమా? అంటున్నారు పరిశీలకులు.