రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా వెనుకబడిపోయింది. ఇక దాన్ని ఐదేళ్ల పాటు చంద్రబాబు ఇంకా వెనక్కి తీసుకెళ్లారు. జగన్ కూడా ఏమి అతీతం కాదు అన్నట్లు రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్లుతున్నారు. వీరి రాజకీయ కక్ష వల్ల మధ్యలో ప్రజలు నష్టపోతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగానే రాజకీయం నడుస్తోంది. వీరి రాజకీయం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కక్ష రాజకీయాలు మరింత పెరిగిపోయాయి. గతంలో తమని ఇబ్బంది పెట్టిన టిడిపి నేతలకు వైసీపీ చుక్కలు చూపిస్తుంది. ఇటు టిడిపి సైతం గుడ్డెద్దు చేలో పడ్డట్టు…జగన్‌పై గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి…జగన్‌ని తీవ్ర పదజాలంతో దూషించారు. అసలు రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి గానీ, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. అలా అంటే వైసీపీ మంత్రులు, నేతలు చంద్రబాబు, లోకేష్‌లని పచ్చి బూతులు తిడుతున్నారని కూడా ఉంది.
అంటే రెండు పార్టీల నేతల మాటలు హద్దులు దాటకూడదు. ఒకవేళ హద్దు దాటితే లీగల్ గా చర్యలు తీసుకోవాలి. పైగా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పని చేయొచ్చు…లేదంటే మాటలతో సమాధానం చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా టిడిపి కేంద్ర కార్యలయంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి ఆఫీసులు, పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. దీని వల్ల వైసీపీకే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.
పట్టాభి మాటలు పక్కకువెళ్ళిపోయి కేవలం దాడులు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల టిడిపిపై సానుభూతి పెరుగుతుంది. టిడిపి కూడా పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఫలితంగా రాష్ర్టంలో అశాంతి నెలకొనే పరిస్తితి వచ్చింది. మొత్తానికి చంద్రబాబు, జగన్‌లు తమ రాజకీయం కోసం జనాలని బలి చేస్తున్నట్లు కనిపిస్తోంది.