భోళాశంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణు స్పందించారు. చిరంజీవి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని తమ వద్దకు దరఖాస్తు వచ్చిందని చెప్పారు. అయితే 12 అంశాలపై ప్రభుత్వం స్పష్టతను కోరిందని, కానీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి వివరణ రాలేదన్నారు. గతంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి టిక్కెట్ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భోళాశంకర్ సినిమాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం విరమిస్తే మంచిదని హితవు పలికారు.
ఆగస్టు 2న భోలా శంకర్ చిత్ర నిర్మాతలు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరారని, అయితే తాము 12 అభ్యంతరాలు లేవనెత్తామని సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వీటికి నిర్మాతలు ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదన్నారు. చిరు వ్యాఖ్యలు చేసింది ఆగస్టు 8న అని ఆయన గుర్తుచేశారు. ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వలేదన్న అక్కసుతోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.