దుమ్ము లేపిన చెన్నై.. వికెట్ న‌ష్ట‌పోకుండా టార్గెట్ చేజ్ చేసి గెలుపు..!

-

దుబాయ్‌లో ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ దుమ్ము లేపింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఉంచిన ల‌క్ష్యాన్ని వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు చెన్నై ఓపెన‌ర్లు పంజాబ్‌పై ఆధిప‌త్యం చెలాయించారు. ఏ ద‌శ‌లోనూ పంజాబ్‌కు కోలుకునే స‌మ‌యం ఇవ్వ‌లేదు. దీంతో చెన్నై జ‌ట్టు పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

chennai won by 10 wickets in ipl 18th match against punjab

మ్యాచ్‌లో పంజాబ్ జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ల‌లో కేఎల్ రాహుల్‌, నికోలాస్ పూర‌న్‌లు రాణించారు. 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో రాహుల్ 63 ప‌రుగులు చేయ‌గా, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స‌ర్ల‌తో పూర‌న్ 33 ప‌రుగులు చేశాడు. చెన్నై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. ర‌వీంద్ర జ‌డేజా, పీయూష్ చావ్లాల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన చెన్నై బ్యాట్స్‌మెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. పంజాబ్ ఉంచిన ల‌క్ష్యాన్ని చెన్నై ఓపెనర్లు ఇద్ద‌రే అల‌వోక‌గా ఛేదించారు. 17.4 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్ట‌పోకుండా చెన్నై 181 ప‌రుగులు చేసి ల‌క్ష్యాన్ని సాధించింది. చెన్నై ఓపెన‌ర్లు షేన్ వాట్సన్‌, డుప్లెసిస్‌లు అద్భుతంగా రాణించారు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో వాట్స‌న్ 83 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, 53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో డుప్లెసిస్ 87 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏ ద‌శ‌లోనూ పంజాబ్ బౌల‌ర్లను వారు కోలుకోనివ్వ‌లేదు. పంజాబ్ బౌల‌ర్లు పేల‌వ‌మైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news