నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు..!

-

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది.

గత 25 ఏళ్లలో తైవాన్‌ సందర్శించిన అతిపెద్ద అమెరికా నేత పెలోసీనే. తైవాన్‌ను తన అంతర్భాగంగా చైనా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. పెలోసీ పర్యటన చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కవ్వింపుగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో పెలోసీ, ఆమె కుటుంబంపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ.. టోక్యోలో విలేకరులతో మాట్లాడారు. ‘తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మమ్మల్ని అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం’’ అని పెలోసీ చెప్పుకొచ్చారు.

మరోవైపు పెలోసీ పర్యటనకు నిరసనగా ఇప్పటికే చైనా తైవాన్‌ సమీపంలో భారీ ఎత్తున యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలను అమెరికా ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ వీటిని కవ్వింపు చర్యలుగా అభివర్ణించారు.

ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ గత మంగళవారం తన బృందంతో కలిసి తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే తైవాన్‌ తమ భూభాగమే అని చెబుతూ వస్తోన్న డ్రాగన్‌.. ఈ పర్యటనపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ జలసంధిలోనే గురువారం నుంచి మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టింది. అయితే చైనా చర్యలపై తైవాన్‌ కూడా దీటుగానే బదులిచ్చింది. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని.. కానీ, ఆ పరిస్థితులు ఎదురైతే తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news