గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి… వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సాధించాలని పిలుపునిచ్చారు సీఎంజగన్. ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపును ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని.. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయింపు అని.. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమమని చెప్పారు. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగు పరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అని మనం చర్చించుకోవాలని వెల్లడించారు.
దీని కోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తామని.. ఆ నెలరోజుల్లో చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం, వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తామన్నారు. ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టి సారిస్తామని.. ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుని చర్చిస్తామని తెలిపారు. వర్క్‌షాపుకు హాజరైనవారు కూడా ఈ అంశాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని.. దీని వల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుందని స్పష్టం చేశారు.