నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ఆదేశించారు సీఎం జగన్. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్ శాఖపై క్యాంప్ ఆఫీస్‌లో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దని.. ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్ శాఖలు పని చేయాలని వెల్లడించారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్ పెట్టాలని.. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని వివరించారు.
పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని.. వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలని ఆదేశాలు జారీ చేశారు. వారంలో మరో రోజు పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష ఉండాలని… ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని స్పష్టం చేశారు సీఎం జగన్. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని చెప్పారు సీఎం జగన్. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి.. సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలన్నారు. వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని… మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలని వెల్లడించారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాలని ఆదేశించారు వైఎస్ జగన్.