రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో 52 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నేరాలు ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా చట్టాలు ప్రయోగిస్తామని అన్నారు జగన్.
దిశా చట్టం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అన్నారు. మహిళల భద్రత కోసమే దిశా చట్టం తీసుకోచ్చామన్న జగన్, హైదరాబాద్ దిశా ఘటన కలచి వేసింది అన్నారు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన చట్టాలు ఎం చెబుతున్నాయని ప్రశ్నించారు జగన్. సినిమాల్లో మాదిరిగా దోషులను కాల్చి చంపే స్వేచ్చ మన చట్టాల్లో లేవన్నారు.
త్వరగా న్యాయం అందకపోతే చట్టాలపై నమ్మక౦ పోతుంది అన్నారు జగన్. త్వరగా శిక్షలు పడితే వ్యవస్థలో భయం వస్తుందని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్ళు అయినా శిక్ష పడలేదు అన్నారు. విచారణకు ఏళ్ళకు ఏళ్ళు పడుతుంటే నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. మార్పు తీసుకురావాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే దిశ చట్టమని అన్నారు జగన్. నేరం జరిగిన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉరి శిక్ష వేస్తామన్నారు. ప్రతీ రంగంలో మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మాదీ అన్నారు జగన్.