ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 6న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా… షెడ్యూల్ ను మార్పు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో రేపు జరగాల్సిన జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జలవివాదాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెడికల్ కళాశాలల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా జమిలీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని లా కమిషన్ స్పష్టం చేసినప్పటికీ కేంద్రం యెుక్క వైఖరిపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికలు అయినా ముందస్తు ఎన్నికలకు అయినా వైసీపీ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.