‘రైతులు చట్టసభల్లోకి రావాలి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలి.. నాగలితో పాటు కలం కూడా పట్టడం నేర్చుకోవాలి’’అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ రైతులు వారి హక్కుల కోసం దేశ రాజధాని దిల్లీలో 13 నెలల పాటు ఆందోళన చేపట్టినా ఫలితం శూన్యమని, అందుకే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు.
తెలంగాణభవన్‌లో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన భార్య హేమ గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, నవనిర్మాణ్ కిసాన్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతు సంఘాల నేతలు తెలంగాణభవన్‌లో కేసీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
‘‘దేశంలో కోట్ల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడానికి బలమైన రాజకీయ అంకితభావం ఉండాలి. అది బీఆర్ఎస్ వద్ద పుష్కలంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయం బాగుపడింది. రైతు ఆత్మహత్యలు లేవు. ఇక్కడ సాధ్యమైనప్పుడు ఒడిశాలో.. దేశంలో ఎందుకు కాదు? ఇది ధన్ కి బాత్ కాదు… మన్ కీ బాత్. దేశ భవిష్యత్తును మార్చేందుకు, దేశ ఆలోచన, భావజాలంలో మార్పు తీసుకురావాలనే ఒక బృహత్తర సంకల్పంతో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఈ ప్రస్థానంలో, మహాయుద్ధంలో భాగస్వాములయ్యేందుకు ఒడిశా నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన మీ అందరికీ స్వాగతం.” అని కేసీఆర్ అన్నారు.