తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ‘నేను చెప్పేమాటలను దళితబిడ్డలు, దళిత మేధావులు ఆలోచన చేయాలి. యుగయుగాలు, తరతరాలుగా దళితజాతి అణచివేతకు గురవుతున్నది. ఇంకెన్ని యుగాలు అలా ఉండాలి. ఎందుకు ఉండాలి. వాళ్లు మనతోటి మనుషులు కారా? గౌరవంగా బతకాలని కోరికలు లేవా? వాళ్లకు ఎమోషన్స్ లేవా? ప్రేమలు లేవా? ఎందుకింత అన్యాయం.
ఆ జాతికి జరగాలి ? కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నాడే వెనుకబడ్డ జాతులు ఏవీ.. మూడునాలుగు నిమన్న కులాలేవి అని గుర్తించి.. వారి కోసం స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి ప్రత్యేక అభివృద్ధి చేసే కార్యక్రమాలు పెట్టి ఉంటే.. వాళ్ల దరిద్రం తీరకపోవునా? దేశంలో ఏ నాయకుడు చేయలేదు. ఏ ప్రభుత్వం చేయలేదు. దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. ఎవడూ చేయలేదు. ఒకటే రోజు చేయకపోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంత లేకపోవచ్చు. కానీ ఆ నినాదం వస్తే.. వారిలో ఆత్మవిశ్వాసం రావాలి.. దఫాల వారీగా అయినా సరేనని కంకణం కొట్టుకొని ఇంటికి రూ.10లక్షలు ఇచ్చేలా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. దళిత సమాజం ఆలోచన చేయాలి. ఇలా చేసే వారిని ప్రోత్సహించాలి.. గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. ‘ఒరవడిలోపడి కొట్టుకుపోవద్దు. గెలిపిస్తే ఇంకా చేయాలని అనిపిస్తుంది. గతంలో బ్యాంకుల్లో అప్పులుంటే.. బ్యాంకుల వాళ్లు తలుపులు తీసుకొని పోతుండే. గవర్నమెంట్ కూడా వారికి సపోర్టు చేస్తుండే. కానీ రైతు పరిస్థితి మెరుగుపరచాలని ఎన్నడూ ఏ పార్టీ ప్రభుత్వం ఆలోచించలే. తెలంగాణ వచ్చాక తీవ్రమైన సమీక్ష జరిపి.. ఏ రంగం నుంచి పని మొదలు కావాలి? మన పునాది ఎక్కడ పడాలి ? గ్రామాలు, పల్లెలు ఎట్లా కళకళలాడాలి ? పచ్చదనం ఎట్లా ఉండాలని ఒక్కొక్క కార్యక్రమాలు నిర్ణయించాం.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.