బీఆర్ఎస్ పార్టీ అధినే, తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పూ రాదన్నారు . మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి లక్ష్యం ఉందా? లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది. ఈ విషయం ఆలోచిస్తే తనకు భయమేస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని కేసీఆర్ తెలిపారు. కానీ అలాంటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదు. మహారాష్ట్ర సంగతి పక్కకు పెట్టండి.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే దుస్థితి. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొరత సమస్య కూడా ఉందని అన్నారు. దేశంలో మార్పు తెచ్చే అంశం మహారాష్ట్రతోనే మొదలవుతుంది అని తెలిపారు కేసీఆర్.