ఎల్బీనగర్‌లో ట్విస్ట్‌లు..తొలిసారి గులాబీ జెండా ఎగిరేనా?

-

ఎల్బీనగర్ నియోజకవర్గం..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకంగా ఉండే స్థానాల్లో ఇది ఒకటి. అటు తెలంగాణతో పాటు ఏపీ నుంచి వచ్చిన సెటిల్ అయిన ఓటర్లు ఇక్కడ ఎక్కువ. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానం ఏర్పడింది. అయితే ఇక్కడ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. గులాబీ జెండా ఎగరలేదు. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. ఇక 2014లో ఏపీలో టి‌డి‌పి వేవ్ ఉండటం వల్ల..ఆ ప్రభావం హైదరాబాద్ పై పడింది. టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తు కలిసొచ్చి..గ్రేటర్ పరిధిలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎల్బీనగర్ సీటుని టి‌డి‌పి గెలుచుకుంది. టి‌డి‌పి నుంచి ఆర్.కృష్ణయ్య గెలిచిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికలకు వచ్చేసరి మళ్ళీ కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ఎల్బీనగర్ లో కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.దీంతో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి మళ్ళీ గెలిచారు. కానీ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీది కావడంతో ఆయన ఆ పార్టీలోకి జంప్ చేశారు. అయితే నియోజకవర్గం పరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. కానీ రాజకీయంగా ఎమ్మెల్యేకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందని సర్వేల్లో తెలుస్తుంది.

ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డికి కాస్త అనుకూల వాతావరణం కనిపించడం లేదు.ఇక సొంత పార్టీలోనే విభేదాలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి రామ్మోహన్ గౌడ్ పోటీ చేసి ఓడిపోతున్నారు. ఇప్పుడు సుధీర్ బి‌ఆర్‌ఎస్ లోకి రావడంతో..వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. సీటు విషయంలో క్లారిటీ లేదు.

అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ నిదానంగా పికప్ అవుతుంది. అటు బి‌జే‌పి కూడా అనూహ్యంగా తమ ఓటు బ్యాంకుని పెంచుకుంటుంది. గత ఎన్నికల్లో బి‌జే‌పికి 21 వేలు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు అవి పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి గాని బి‌జే‌పికి మద్ధతు ఇస్తే..ఎల్బీనగర్ లో పోరు హోరాహోరీగా ఉంటుంది. మరి బి‌ఆర్‌ఎస్ సీటు ఎవరికి దక్కుతుంది? ఈ సారైనా అక్కడ గులాబీ జెండా ఎగురుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news