నల్గొండ వాసులకు సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. నల్గొండ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి జరుగాలని… నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబో దని… నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దా లన్నారు. నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేస్తామని… ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవా లని ఆదేశించారు.
నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పాదయాత్రలు చేపట్టి అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్ ను వెంటనే నియమించాలనీ సీఎం కెసీఆర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు.
నల్లగొండను అభివృద్ధి చేసే దాకా నిద్రపోవద్దని, సిద్దిపేటను తీర్చిదిద్దినట్లుగా నల్లగొండనూ తీర్చిదిద్దాలని అన్నారు. నల్లగొండలో స్ట్రీట్ లైట్ల పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు నల్లగొండలో విద్యుత్ పరిస్తితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావాల్సినన్ని సబ్ స్టేషన్లు నిర్మించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పట్టణంలో అనువైన స్థలాలను ఎంపిక చేసుకొని, వాటిలో వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని, రైతు బజార్లు నిర్మించాలన్నారు.