ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కమ్యునిస్టుల విచిత్ర పొత్తులు

-

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం విచిత్రపొత్తులు ఆసక్తికరంగా మారాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలు ఖమ్మంలో మాత్రం చెరోపక్షంగా మారాయి. చివరి నిమిషంలో జరిగిన డ్రామాతో సీపీఐ, సీపీఎంలు చేరో దారి ఎంచుకొన్నాయి. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చి ఖమ్మంలో మాత్రం మరో నిర్ణయం తీసుకోవడం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.


ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌ అయిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు. సుమారు 15 డివిజన్లలో లెఫ్ట్‌ పార్టీల ప్రభావం ఉంటుందని అంచనా. పువ్వాడ ఫ్యామిలీ ఎటు ఉంటే అటే సీపీఐ మొగ్గు చూపుతుందనే టాక్‌ ఉంది. ఇప్పుడు కూడా ఆ దిశగానే అడుగులు పడ్డాయి. టీఆర్‌ఎస్‌తో సీపీఐ మాత్రమే కలిసి వెళ్తోంది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌, టీడీపీలతో జతకట్టడానికి నిర్ణయించుకున్నాయి. దీంతో రెండు పార్టీలు ఎందుకీ నిర్ణయం తీసుకున్నాయా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది.

గత కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో పువ్వాడ అజయ్‌ కాంగ్రెస్‌లో ఉండటంతో ఆపార్టీకి సీపీఐ మద్దతిచ్చింది. ఆరుచోట్ల పోటీ చేసి రెండు డివిజన్లు గెలిచింది. సీపీఎం మాత్రం ఒంటరిగానే 26 డివిజన్లలో పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించింది. మరో నాలుగుచోట్ల సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో పువ్వాడ టీఆర్ఎస్‌లో ఉండటంతో సీపీఐ అటే చూసింది. సీపీఎ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం అధికారపార్టీతోనే వెళ్లాలని అనుకున్నారట. ఆ దిశగా చర్చలు మొదలైనట్టు సమాచారం. కానీ.. సాగర్‌ ఉపఎన్నికల్లో అనుసరించిన వైఖరిపై విమర్శలు రావడంతో సీపీఎం రాష్ట్ర కమిటీ పునరాలోచనలో పడింది.

అధికార పార్టీకి మద్దతిస్తే అభాసుపాలవుతామని భావించి కాంగ్రెస్‌, టీడీపీలతో కలిసి వెళ్లడానికి నిర్ణయించడంతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఖమ్మంలో మొదటి నుంచి సీపీఐ కంటే సీపీఎంకు బలం ఎక్కువ. కార్పొరేషన్‌ కాక మునుపు ఖమ్మం మున్సిపాలిటీకి 40 ఏళ్లపాటు సీపీఎం నేత చిర్రావూరి లక్ష్మీనర్సయ్య ఛైర్మన్‌గా చేశారు. అలాంటి చోట ఇప్పుడు లెఫ్ట్‌ పార్టీలు వేరే పక్షాలతో కలిసి సీట్లు పంచుకోవాల్సిన స్థితికి వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీఐకి 5 డివిజన్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌, టీడీపీలతో సీపీఎం సీట్ల చర్చ కొలిక్కి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news