నిరుద్యోగుల కోసం, తెలంగాణ యువత కోసం అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీసులతో సహా అన్ని అస్త్రాలను కేసీఆర్ వినియోగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ యువత, విద్యార్థులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని.. కానీ తెలంగాణ బిడ్డలకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు.
తెలంగాణలో అనేకమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని.. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీరాలంటే తెలంగాణలో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. సరుకులు అమ్మినట్లు ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారని దుయ్యబట్టారు షర్మిల. ప్రతిపక్షాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఎం నేతలతో చర్చించామని… వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీపీఎం పార్టీ చేసే పోరాటాలకు నన్ను ఆహ్వానిస్తే నేను పాల్గొంటానని స్పష్టం చేశారు. మేము బీజేపీకి బీ టీమ్ కాదని… బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. కానీ కమ్యూనిస్టులు మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బీ టీమ్ గా పని చేశారని ఆరోపించారు షర్మిల. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని బీజేపీని ప్రశ్నించానన్నారు.