కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలసి కోఆపరేటివ్ ఫెడరలిజం కొనసాగిస్తున్నాయి. కేటీఆర్ మీద పెట్టిన కేసు విషయంలో ఈడీ కేసు దాఖలు చేయడం దానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.
పంచ పాండవులే మంచం కోళ్ల వలె ముచ్చటగా ముగ్గురు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు తీరు ఉంది. వందేళ్ల పార్టీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, ‘మాకు తెలియదా?’ అని మీరే అన్నారని, ఇప్పుడు పథకాలు అమలు చేయమంటే కేసీఆర్ సర్కార్ మీద నెపం నెడుతున్నారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రజల అవసరాలు ఏమిటి? వనరులను ఎలా వినియోగించాలి అన్న ఆలోచన లేకుండా, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం దారుణం అన్నారు.