ఇంకేముంది.. మా బంధం ఫెవికాల్ కన్నా ద్రుఢంగా ఉంటుంది. ఇది ఖాయం.. నిజం నిజం.. మీరు నమ్మా లె!! మూడు పొద్దులకో ముచ్చట లేదు!! అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి, బహిరంగ సభల్లో వేదికలు పంచు కున్న తెలంగాణ కాంగ్రెస్-టీడీపీ నేతల మధ్య బంధం.. నేతిబీరలో నెయ్యి మాదిరిగానే అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కేసీఆర్‌కు చెక్ పెట్టాలె అంటూ.. చేతులు కలిపి మరీ.. సంయుక్తంగా పోరుకు దిగాయి. అయితే,.. వీరిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
ఈ బందం ఎంత కాలం నిలుస్తుందనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన టీడీపీ పోయి పోయి ఆ పార్టీలో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడాన్ని టీడీపీలోని ఓ వర్గం నాయకులే వెగటుగా ఫీలయ్యారు. అయినప్పటికీ.. చంద్రబాబు అండ్ కోలు మాత్రం కేసీఆర్‌ను దిమ్మతిరిగేలా ఎదుర్కొంటామనే బీషణ ప్రతిజ్ఞల నేపథ్యంలో ముందుకు సాగి.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాహుల్‌తో కుర్చీలు పంచుకున్నారు.
ఇది జరిగి పట్టుమని 9 నెలలు కూడా తిరగ క ముందుగానే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పింది.తాజాగా నోటిఫికేషన్ విడుదలైన హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనేతన పాతమిత్రులను కలిసి రావాలని కూడా పిలుపు నిచ్చారు కాంగ్రెస్ నాయకులు. కానీ, టీడీపీ మాత్రం నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఏకంగా.. అభ్యర్థిని ప్రకటించింది.
రజాకార్ల కుటుంబానికి చెందిన కిరణ్మయిని ఇక్కడ నుంచి నిలబెడుతున్నట్టు ఎల్ రమణ ప్రకటించారు. ఆమెకు నామినేషన్ పత్రాలను కూడా అప్పగించారు. తాను స్థానికురాలినని, కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లు నిలబెట్టే నాయకులు స్థానికేతరులని అప్పుడే కిరణ్మయి ప్రసంగాలు ప్రారంభించేసింది. సరే! ఇదెలా ఉన్నా.. టీడీపీ-కాంగ్రెస్‌ల ఎన్నికలబంధంపై మాత్రం సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి.