రేవంత్ త్రిశూల వ్యూహం… కేసీఆర్ తట్టుకుంటారా?

-

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలే టార్గెట్‌గా సీఎం కేసీఆర్ దళితబంధు‌ను తెచ్చారు. ఈ నియోజక వర్గంలోని దళిత కుటుంబాలను ఆకర్షించేలా కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత బహుజనులు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టేలా కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేసీఆర్ విస్మరించిన హామీలు.. ప్రతి ఉప ఎన్నికల సమయంలో వేస్తున్న ఎత్తులను ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా త్రిశూల వ్యూహాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.

ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హామీలనే అస్త్రంగా ఉపయోగించనున్నారు. దళిత, గిరిజన దండోరా పేరిట సీఎం కేసీఆర్ హామీలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత, గిరిజనులను సమీకరించి దండోరా పేరిట నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్ట్ 9న ఇంద్రవెళ్లిలో లక్షమందితో దళిత, గిరిజన దండోరా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌తో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.

 

మొదట అన్ని మండలాల్లోర్యాలీలు తీసి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దళితబంధు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఎమ్మెల్యేల శవయాత్రలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో లక్ష మందితో దళిత, గిరిజన సభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా.. అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గా లకు టీపీసీసీ ముఖ్య నేతలను ఇంఛార్జీలుగా నియమించనున్నారు. చివరగా రాష్ట్ర స్థాయిలో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.. దీంతో టీఆర్ఎస్‌పై యుద్ధం మొదలవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news